Monday, September 25, 2023

ఓటు ప్రక్రియ

 నేను ప్రతిసారి కచ్చితంగా ఓటు వేస్తుంటాను.. ఓటు వేయటం నా బాధ్యత

ఎందుకంటే ఆ నా బాధ్యత, నాకు ఈ క్రింది హక్కులు కల్పిస్తుంది

తప్పు జరిగితే నిలదీసే శక్తినిస్తుంది. 
తప్పుని సరిచేసే అవకాశం ఇస్తుంది. 
అభివృద్ధి కాంక్షను బలంగా చెప్పే ధైర్యాన్నిస్తుంది. 
అభివృద్ధి వైపు దిశానిర్ధేశం చేసే దార్శనీయతనిస్తుంది. 
ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నించే బలాన్నిస్తుంది. 

నేను ఓటు వేస్తాను..!! మరి మీరు..?? 
నేను ఓటుకు ఎట్టిపరిస్థితుల్లో నోటు తీసుకోను..!! మరి మీరు ..?? 

ఓటు వేయకుంటే హక్కులు కోల్పోతావు..!! 
ఓటు అమ్ముకుంటే సర్వస్వం కోల్పోతావు ..!! 
                                                                           - గోపాల్దాస్ రాము

Thursday, March 23, 2023

నేడు తాగే నీటిని సీసాల్లో మోస్తున్నాం - రేపు పీల్చే గాలిని కూడా సీసాల్లో మోయాలా??

మార్చి 21 - ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని. నేడు తాగే నీటిని సీసాల్లో మోస్తున్నాం - రేపు పీల్చే గాలిని కూడా సీసాల్లో మోయాలా?? మానవుడు ప్రకృతిని చిద్రం చేస్తున్నాడు.. కొండలు, గుట్టలు, పర్వతాలను పిండి చేస్తున్నాడు. చెరువులు, కొలనులు, సరస్సులను నామరూపాలు లేకుండా వాటి ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాడు. అభివృద్ధి పేరుతో, నగరాల విస్తరణ పేరుతో.. సిమెంట్ కట్టడాలు నిర్మిస్తూ పోతూ స్వార్థ చింతనతో వివేక రహితంగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ అర్థరహిత అల్పానందం పొందుతూ, మానవాళితో పాటు జీవజాతులన్నింటిని అతి ప్రమాదంలోకి నెట్టుతున్నాడు. ఒక ఇల్లు లేదా, ప్రాణం లేని ఏదేని చిన్న కట్టడం కోసం ప్రాణం గల ఎంత పెద్ద వృక్షాన్ని అయినా దయ, కనికరం, ఆలోచన ఏమాత్రం లేకుండా నిర్ధాక్షిణ్యంగా కూకటివేళ్లతో సహా పెకలిస్తున్నాడు. అప్పటివరకు ఆ వృక్షాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న ఎన్నో ప్రాణులకు దిక్కు తోచని స్థితిని కలిగిస్తూ వాటి బ్రతుకుదెరువును కాలరాస్తున్నాడు. దానితో పాటు పక్షుల్లాంటి జీవులకు జీవాధారం అయిన వృక్షం కాలగర్భంలో కలిసిపోతుంటే అవి ఎంత తల్లడిల్లి పోతున్నాయోనని సాటి ప్రాణిగురించి ఆలోచించే పరిస్థితే లేదు. మానవునిలో 'నేను' అనే అతి క్రూరమైన స్వార్థం చేరి 'మనిషి' అనే సంఘజీవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. 'నాది' అనే మాయా మోహంతో విగతజీవియై, ప్రేమానురాగాలు, అమృతతుల్యమైన ఆప్యాయతలు అలంకృతమైన అనురాగాలు ఆకట్టడాలు, నిర్మాణాల పునాదుల్లో సమాధులవుతున్నాయి. చెట్లుంటేనే కదా ప్రాణావాళికి ప్రాణవాయువైన ఆక్షిజన్ లభించేది, అలాంటిది చెట్లను వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా మొక్కల్ని, వృక్షాల్ని చిదిమేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి జీవరాశి పుట్టుకకి ఏదో పరమార్థం దాగి ఉందన్న జీవితసత్యాన్ని మరిచి మనిషి కొండల్ని పిండిచేసి చెరువులు, సరస్సులు పూడ్చి సమాంతరంగా చదును చేస్తూ ఎత్తుపల్లాలు పూడ్చి నేలను పూర్తిగా మారుస్తూ ప్రకృతి పరిసర సమతుల్యతను పాటించకపోవుటచే జీవజాలమంతా ప్రకృతి ప్రకోపాగ్నికి గురవుతుంది. అయినప్పటికీ మనిషి ఆలోచన విధానంలో మార్పు రాక స్వార్ధ చింతనతో చేసే ఏ ఒక్క విధ్వంసాన్ని కూడా ఆపక, ప్రకృతిపై రెట్టింపు దాడులకు పాల్పడుతున్నాడు. ఈ చర్యలవల్ల మానవాళితో పాటు జీవరాశులన్నింటి ఉనికికే ముప్పు వాటిల్లిన పరిస్థితి దాపురించింది. దాంతో, మనిషి నేడు భూభాగంలో 71శాతం ఉన్న నీటిని సీసాలతో మోస్తూ తీసుకెళ్లే పరిస్థితికి తెచ్చాడు. నేడు అడవులు చెట్లు విపరీతంగా నరికివేయటం వల్ల ప్రపంచ ప్రాణావాళికి ప్రాణాధారమైన ప్రాణవాయువు అందక, కలుషితమై పరిమితుల పరిస్థితులలో గాలి సీసాలు వీపునేసుకుని మోసే గతి దాపురింపజేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్ తరాల భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు. చెట్లు ప్రసాదించిన ఉచిత వరప్రదాయిని విశ్వవ్యాప్తమైన ప్రాణవాయువును కలుషితం చేసి దాన్ని శుద్ధి చేసిన పేరుతో సీసాల్లో నింపి వ్యాపారంచేసే దౌర్బగ్య పరిస్థితికి తీసుకువచ్చాడు. ఇప్పటికింకా మేల్కొపోతే మానవాళితో పాటు జీవకోటి ఉనికినీ కోల్పోతాం.. ఆలస్యం చేయక ప్రతి ఇంటిపై, అలాగే ప్రతి కట్టడంపై కనీసం 20 చెట్లకి తక్కువ కాకుండా మొక్కలు పెంచుదాం, ఉడతా భక్తిగా ప్రకృతి పరిరక్షణకు పాటుపడదాం. జై నేచర్..! జై జై నేచర్..!! సేవ్ నేచర్..! ఇట్ సేవ్ ఫ్యూచర్..!! - గోపాల్దాస్ రాము, పర్యావరణ సేవకుడు