Tuesday, March 10, 2009

శిదిలావస్థలోని ఆలంపూర్ దేవాలయాలు

అధ్బుత కళానైపుణ్యంతో ఎంతో అపురూపంగా రూపు దిద్దుకుని మహా పుణ్య క్షేత్రాలు, అష్టాదశ పీఠాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, తుంగభద్రా నదీ తీరాన దేదీప్యమానముగా వెలుగొందిన మహా పుణ్యక్షేత్రం మన అలంపూర్. ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని, రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూల్ కి కూతవేటు దూరంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధి లోని అలంపూర్ నియోజకవర్గ ముఖ్య పట్టణం లో వెలసినదే " శ్రీ జోగులాంబ" అష్టాదశ పీఠం.

ఒకానొక రోజున జగజ్జయమనముగా వెలుగొంది, భక్తుల కోర్కెలు దీర్చే కొంగుబంగారమై భక్తులని అలరించి, ఆలించి పాలించె అమ్మగా కీర్తి గడించిన ఆ అమ్మలగన్న అమ్మ, జగజ్జనని ఈ "జోగులాంబ". చరిత్ర పుటలలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని అష్టాదశ పీఠాలలో అయిదవదై కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన "జోగులాంబ", నేడు అక్కరకు రానిదై చుట్టూ స్మశాన భీకర వాతావరణంతో చుట్టూ ముట్టిన మసిదులతో.. పాడుబడిన ప్రహరీ గోడలతో..శిధిలమైన గుడి గోపురాలతోను, శిధిలావస్థలో ఉన్న నంది, శివ లింగాలు శిలావస్తకు చేరువై ఎలాంటి పూజలు నోచుకోక ఎండా వానలే నిత్య అభిషేకాలుగా కోటి లింగాలు కన్నీరు కారుస్తున్నాయి (వరాహాలు మురికి కూపంలో మునిగి వచ్చి తమ శరీరాన్ని లింగాలకి రాస్తూ, ఆ లింగాలకి అభిషేక, విభూతులుగా అలంకరిస్తూ.. తమ వంతు మురుగు పూజలు జరిపిస్తున్న పట్టించుకునే నాధుడే లేరనుకోండి అది వేరు). తల మొండెం లేని నందీశ్వరులు వేవేలు తమ శరీర భాగాలకై తపమాచరిస్తున్నట్టు కొట్టోచ్చినట్టు కనిపిస్తుందిక్కడ . ఎంతో ఘణమైన చరిత్ర కలిగిన ఈ పవిత్ర పుణ్య క్షేత్రం ఆదిశక్తి యైన అమ్మవారి అష్టాదశ పీఠాలలో అయిదవది అయినప్పటికిని, చేసే కనీస పూజలకు కుడా నోచుకోక ఎంతో దుర్భర దయనీయ స్థితిలోఉంది అని చెప్పుటకు సిగ్గుగా ఉన్నది. ఆ శిధిల దేవాలయాల నగరం తనలో తను కుమిలి కుమిలి గుండెలవిసేలా ఏడుస్తుంది.

కనీసపు ఆలోచన కల్గిన ప్రతి మనిషిని ఆలోచింప చేస్తుంది ఇక్కడి చిద్రమై, చిన్నాభిన్నమైన వాతావరణం. ఎన్నటికి తలరారనిధిగా, చరిత్రకే అలరారని అక్కడి దేవాలయ సముదాయం నేటికి తలమానికం, అక్కడి దేవాలయ సముదాయాన్ని చూస్తే అచ్చెరువుతో నిశ్శేష్టులవ్వక మానరు. కాని పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షం నేనే అన్నట్టు, అక్కడి శిథిల గోపురాలు ఆ "జోగులాంబకే" వదిలేసారు. నవాబుల దండయత్రకే గర్వకారణం అన్న చందంగా వాటిని శిధిలాలుగానే కనుమరుగావ్వాలని నిర్ణయించినట్టు గోచరిస్తుంది అచటి పరిస్థితి. కాని గుండెలు తరుక్కుపోయే ఎన్నో నిజాలు మనల్ని నిశ్శేష్టుల్ని చేస్తాయి, అక్కడికి చేరినప్పటినుండి మన మనో వేదన అలవి గాకుండా మారుతుంది, నేను అందుకు మినహాయింపు ఏమాత్రం కాదు సుమా... అక్కడి చరిత్ర, అమ్మవారి లీలా మహత్యం వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే "జోగులాంబ" కి వచ్చిన కష్టాలు చూస్తుంటే మనసు తరుక్కు పోతుంది, కళ్ళు చెమరుస్తాయి, భక్తుల హృదయాల్లో.. ప్రతీకారజ్వాల రగులుతుంది ఆ నిమిషం. మన (నా) మనసు ఎంతలా ఘోషిస్తుందో మాటలతో చెప్పటానికి ఏమాత్రం అలవిగాదు తలచుకుంటేనే భయకంపితులవుతము కాని ఏమి చేస్తాం పాలకుల దుష్ట కుల రాజకీయాలకు, ముస్లిం ప్రభువుల అహంకారానికి బలై , నేటికి శిధిలావస్థలో నిల్చొని అభివృద్దికై అర్దిస్తున్నట్టు, చేతులు చాచి వేడుకుంటున్నట్టు ... మనసు బెట్టి నన్నూ ఒక్క్కసారి చూడండి అని బిగ్గరగా రోదిస్తూ.. దిక్కులు పిక్కటిల్లేలా ఎడుస్తున్నట్టుంటుంది అక్కడి ఆలయ సముదాయ దుర్లభ స్థితి. ఆ శిధిల దేవాలయాల నగరం, తనలో తను కుమిలి కుమిలి గుండెలవిసేలా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో లో ఉన్న కారణంగానో, లేక ఈ జిల్లా వెనకబడింది అనటానికి చిహ్నం గానో, దీన్ని వెనకబడేలా తాయారు చేసారులా గోచరిస్తుంది. ఒకనాడు వెలుగులీనినా నేడు వెనకబడి వెలవెల బోతున్నాయి ఇక్కడి పరిసరాలు.


ఆ శిథిల దేవాలయాల నగరం తనలో తాను కుమిలి కుమిలి గుండెలవిసేలా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడినుండి వీడుతుంటే. ఈ శిధిలాలను ఈ పాలకులు ఎన్నాళ్ళకు పట్టించుకునేరు... అని దిగులుగా అక్కడకి వెళ్ళిన ప్రతి భక్తుణ్ణి దీనంగా అడుగుతున్నట్టుంటుంది. ఏన్నాళ్ళకి ఈ పాలకులు మేల్కొనేరు.. ఆ శిథిలాలకి పూర్వవైభవం ఎప్పటికి వచ్చేను...అని ప్రతి భక్తుడు ఆ శుభ ఘడియకై ఎదురుచూస్తున్నారు. కాని "జోగులాంబ" మాత్రం నాయకులే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తనవంతు కృషి చేస్తేనే ఆ ఆలయ సముదాయానికి కొత్త రూపు చేకూరుతుందని గాఢంగా విశ్వసిస్తుంది. జోగులాంబ ఆ రోజుకి ఊరంత కళ్ళతో తుంగభద్రా నది ఒడ్డున దీనంగా, నిశ్శేస్టురాలిలా..

పూజలర్పించే మనసులకై, మనుషులకై కోటి లింగాల సమేతముగా అర్పించే భక్తులకై, అర్చించే చేతులకై నిత్యన్నాభిషేకాలు మాని ఎదురుచూస్తుంది అలంపురవాసిని.

అర్పించి అర్చిస్తారని, అక్కడి అభివృద్ధిలో పాలు పంచుకొని ఆ "జోగులాంబ" కృపా కటాక్షానికి పాత్రులవుతారని మనస్పూర్తిగా అభిలషిస్తూ.. ధన్యవాదములతో.. "రాము"


"జోగులాంబ" కృపా కటాక్ష సిద్ధిరస్తు...