Monday, September 25, 2023

ఓటు ప్రక్రియ

 నేను ప్రతిసారి కచ్చితంగా ఓటు వేస్తుంటాను.. ఓటు వేయటం నా బాధ్యత

ఎందుకంటే ఆ నా బాధ్యత, నాకు ఈ క్రింది హక్కులు కల్పిస్తుంది

తప్పు జరిగితే నిలదీసే శక్తినిస్తుంది. 
తప్పుని సరిచేసే అవకాశం ఇస్తుంది. 
అభివృద్ధి కాంక్షను బలంగా చెప్పే ధైర్యాన్నిస్తుంది. 
అభివృద్ధి వైపు దిశానిర్ధేశం చేసే దార్శనీయతనిస్తుంది. 
ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నించే బలాన్నిస్తుంది. 

నేను ఓటు వేస్తాను..!! మరి మీరు..?? 
నేను ఓటుకు ఎట్టిపరిస్థితుల్లో నోటు తీసుకోను..!! మరి మీరు ..?? 

ఓటు వేయకుంటే హక్కులు కోల్పోతావు..!! 
ఓటు అమ్ముకుంటే సర్వస్వం కోల్పోతావు ..!! 
                                                                           - గోపాల్దాస్ రాము

Thursday, March 23, 2023

నేడు తాగే నీటిని సీసాల్లో మోస్తున్నాం - రేపు పీల్చే గాలిని కూడా సీసాల్లో మోయాలా??

మార్చి 21 - ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని. నేడు తాగే నీటిని సీసాల్లో మోస్తున్నాం - రేపు పీల్చే గాలిని కూడా సీసాల్లో మోయాలా?? మానవుడు ప్రకృతిని చిద్రం చేస్తున్నాడు.. కొండలు, గుట్టలు, పర్వతాలను పిండి చేస్తున్నాడు. చెరువులు, కొలనులు, సరస్సులను నామరూపాలు లేకుండా వాటి ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాడు. అభివృద్ధి పేరుతో, నగరాల విస్తరణ పేరుతో.. సిమెంట్ కట్టడాలు నిర్మిస్తూ పోతూ స్వార్థ చింతనతో వివేక రహితంగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ అర్థరహిత అల్పానందం పొందుతూ, మానవాళితో పాటు జీవజాతులన్నింటిని అతి ప్రమాదంలోకి నెట్టుతున్నాడు. ఒక ఇల్లు లేదా, ప్రాణం లేని ఏదేని చిన్న కట్టడం కోసం ప్రాణం గల ఎంత పెద్ద వృక్షాన్ని అయినా దయ, కనికరం, ఆలోచన ఏమాత్రం లేకుండా నిర్ధాక్షిణ్యంగా కూకటివేళ్లతో సహా పెకలిస్తున్నాడు. అప్పటివరకు ఆ వృక్షాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న ఎన్నో ప్రాణులకు దిక్కు తోచని స్థితిని కలిగిస్తూ వాటి బ్రతుకుదెరువును కాలరాస్తున్నాడు. దానితో పాటు పక్షుల్లాంటి జీవులకు జీవాధారం అయిన వృక్షం కాలగర్భంలో కలిసిపోతుంటే అవి ఎంత తల్లడిల్లి పోతున్నాయోనని సాటి ప్రాణిగురించి ఆలోచించే పరిస్థితే లేదు. మానవునిలో 'నేను' అనే అతి క్రూరమైన స్వార్థం చేరి 'మనిషి' అనే సంఘజీవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. 'నాది' అనే మాయా మోహంతో విగతజీవియై, ప్రేమానురాగాలు, అమృతతుల్యమైన ఆప్యాయతలు అలంకృతమైన అనురాగాలు ఆకట్టడాలు, నిర్మాణాల పునాదుల్లో సమాధులవుతున్నాయి. చెట్లుంటేనే కదా ప్రాణావాళికి ప్రాణవాయువైన ఆక్షిజన్ లభించేది, అలాంటిది చెట్లను వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా మొక్కల్ని, వృక్షాల్ని చిదిమేస్తున్నారు. ప్రకృతిలో ప్రతి జీవరాశి పుట్టుకకి ఏదో పరమార్థం దాగి ఉందన్న జీవితసత్యాన్ని మరిచి మనిషి కొండల్ని పిండిచేసి చెరువులు, సరస్సులు పూడ్చి సమాంతరంగా చదును చేస్తూ ఎత్తుపల్లాలు పూడ్చి నేలను పూర్తిగా మారుస్తూ ప్రకృతి పరిసర సమతుల్యతను పాటించకపోవుటచే జీవజాలమంతా ప్రకృతి ప్రకోపాగ్నికి గురవుతుంది. అయినప్పటికీ మనిషి ఆలోచన విధానంలో మార్పు రాక స్వార్ధ చింతనతో చేసే ఏ ఒక్క విధ్వంసాన్ని కూడా ఆపక, ప్రకృతిపై రెట్టింపు దాడులకు పాల్పడుతున్నాడు. ఈ చర్యలవల్ల మానవాళితో పాటు జీవరాశులన్నింటి ఉనికికే ముప్పు వాటిల్లిన పరిస్థితి దాపురించింది. దాంతో, మనిషి నేడు భూభాగంలో 71శాతం ఉన్న నీటిని సీసాలతో మోస్తూ తీసుకెళ్లే పరిస్థితికి తెచ్చాడు. నేడు అడవులు చెట్లు విపరీతంగా నరికివేయటం వల్ల ప్రపంచ ప్రాణావాళికి ప్రాణాధారమైన ప్రాణవాయువు అందక, కలుషితమై పరిమితుల పరిస్థితులలో గాలి సీసాలు వీపునేసుకుని మోసే గతి దాపురింపజేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్ తరాల భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు. చెట్లు ప్రసాదించిన ఉచిత వరప్రదాయిని విశ్వవ్యాప్తమైన ప్రాణవాయువును కలుషితం చేసి దాన్ని శుద్ధి చేసిన పేరుతో సీసాల్లో నింపి వ్యాపారంచేసే దౌర్బగ్య పరిస్థితికి తీసుకువచ్చాడు. ఇప్పటికింకా మేల్కొపోతే మానవాళితో పాటు జీవకోటి ఉనికినీ కోల్పోతాం.. ఆలస్యం చేయక ప్రతి ఇంటిపై, అలాగే ప్రతి కట్టడంపై కనీసం 20 చెట్లకి తక్కువ కాకుండా మొక్కలు పెంచుదాం, ఉడతా భక్తిగా ప్రకృతి పరిరక్షణకు పాటుపడదాం. జై నేచర్..! జై జై నేచర్..!! సేవ్ నేచర్..! ఇట్ సేవ్ ఫ్యూచర్..!! - గోపాల్దాస్ రాము, పర్యావరణ సేవకుడు

Saturday, November 21, 2009

తన్మయత్వం

నీ ప్రేమాభిమానాలకు తన్మయత్వంతో తడిసి ముద్దయ్యాను.
నీ చనువుతో పలుమార్లు ఉశ్వాస నిశ్వాసాలు కూడా మరిచాను.
అంతటి అభిమానంతో ప్రపంచాన్ని మరిచేలా చేసావు.
నా ఉనికినంతటిని మరిచి నీ మురిపెంతో ముగ్ధుడినయ్యాను.
రంగవల్లిక రంగుల్లా నీ నవ్వులు విరబూస్తున్న ప్రతిసారి ప్రపంచమక్కడే ఆగితే బావుండనిపిస్తుంది.
ఊపిరిసలపని పనివత్తిడిని సైతం నీ సహచర్యంతో ఊహకైనరానివ్వక నను ఊయలలూగించావు. నీ నుదురు ముద్దాడిన క్షణం ప్రపంచమంతా చిన్నదై ఆకాశం అందినట్టనిపించింది.
తారలతో తేలిపోతున్న ఆ తరుణంలో చంద్రబింబాన్ని పట్టిచూసా, నీ అందపు కొనగోటికి సరితూగదా ఆ వయ్యారి నెలవంక సౌందర్యం. ఆ తన్మయత్వంలో ... సుకుమార, సౌందర్య కోమల లావణ్య మైన నీ ముఖారవిందాన్ని దోసిట ధాసేయ దోసెను.

Sunday, November 8, 2009

మూడు మాటలు...

నిన్న వచ్చాము సుఖసంతోషాల లోతుల కోసం
నేడు ఉన్నాము సుఖదుఃఖాల జ్ఞాపకాలలో..
రేపు వెళతాము నిస్సారమైన వట్టి చేతులతో ...

Wednesday, November 4, 2009

నీ చేతి స్పర్శతో ...

ఎల్లలు లేని ఇంద్రధనస్సు ఎదుట నిలచిన పులకింత
పుడమి పులకించి ప్రవహించిన పరవశం
కోకిల కంఠస్వరం సృజించిన మధురస్మృతి
నెమలికి నృత్యం నేర్పిన మనసు తన్మయత్వం
శిశిరంలో చిగురులై మనసు పచ్చదనపు మొగ్గలు దొడుగుతుంది
... ఒక్క నీ చేతి స్పర్శతో

నీవై....

గుండెల్లోని ప్రేమ శ్వాసతో ఏకమై శరీరమంతా ఆవహించటం మెలుకువలోనూ తెలుస్తుంది.
నా ఉశ్వాస, నీ గురించిన స్మృతులందించి నా అంతరంగములకు జీవం నింపుతున్నది
నా నిశ్వాస, నీవే ప్రాణమై నాలోని ఆకృతులకు ఆయువు నాపాదిస్తున్నది
నీ స్పర్శలోని మాధుర్యాన్ని నా మనసు అంతరంగాలు మరిపింపజేయుచున్నవి
నీ మందహాసంలోని మమతానురాగాలు నా అలసిన ఆలోచనల్ని తేలికపరుస్తున్నవి
నీ పరాచికాల పలకరింతలు నాలోని అహర్ణిషల అలసటని పారద్రోలుచున్నవి
నీ తలపుల తలంపులతో నాకు గెలుపు సులభ తరమగుతున్నది నేస్తం
నీ ఆలోచనలే ఆయువులై చరిత్ర తిరగరాసే శక్తి నింపుతున్నావు
నా మనసు విషపూరితమవ్వకముందే, నీ సన్నిహితపు స్మృతులు చెదరకముందే
నీ ఊహల్లో కలకలం సృష్టించకముందే, నా నుండి నువ్వు వేరవ్వకముందే,
నేను కనుమరుగు అవ్వాలనే తాపత్రయ పడుతున్నాను.
...
నువ్వే నన్ను దరిజేర్చు నేస్తం పార్తివుడినై ఉండిపోత ఎప్పటికి నీవై ...

Tuesday, March 10, 2009

శిదిలావస్థలోని ఆలంపూర్ దేవాలయాలు

అధ్బుత కళానైపుణ్యంతో ఎంతో అపురూపంగా రూపు దిద్దుకుని మహా పుణ్య క్షేత్రాలు, అష్టాదశ పీఠాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, తుంగభద్రా నదీ తీరాన దేదీప్యమానముగా వెలుగొందిన మహా పుణ్యక్షేత్రం మన అలంపూర్. ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని, రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూల్ కి కూతవేటు దూరంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధి లోని అలంపూర్ నియోజకవర్గ ముఖ్య పట్టణం లో వెలసినదే " శ్రీ జోగులాంబ" అష్టాదశ పీఠం.

ఒకానొక రోజున జగజ్జయమనముగా వెలుగొంది, భక్తుల కోర్కెలు దీర్చే కొంగుబంగారమై భక్తులని అలరించి, ఆలించి పాలించె అమ్మగా కీర్తి గడించిన ఆ అమ్మలగన్న అమ్మ, జగజ్జనని ఈ "జోగులాంబ". చరిత్ర పుటలలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని అష్టాదశ పీఠాలలో అయిదవదై కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన "జోగులాంబ", నేడు అక్కరకు రానిదై చుట్టూ స్మశాన భీకర వాతావరణంతో చుట్టూ ముట్టిన మసిదులతో.. పాడుబడిన ప్రహరీ గోడలతో..శిధిలమైన గుడి గోపురాలతోను, శిధిలావస్థలో ఉన్న నంది, శివ లింగాలు శిలావస్తకు చేరువై ఎలాంటి పూజలు నోచుకోక ఎండా వానలే నిత్య అభిషేకాలుగా కోటి లింగాలు కన్నీరు కారుస్తున్నాయి (వరాహాలు మురికి కూపంలో మునిగి వచ్చి తమ శరీరాన్ని లింగాలకి రాస్తూ, ఆ లింగాలకి అభిషేక, విభూతులుగా అలంకరిస్తూ.. తమ వంతు మురుగు పూజలు జరిపిస్తున్న పట్టించుకునే నాధుడే లేరనుకోండి అది వేరు). తల మొండెం లేని నందీశ్వరులు వేవేలు తమ శరీర భాగాలకై తపమాచరిస్తున్నట్టు కొట్టోచ్చినట్టు కనిపిస్తుందిక్కడ . ఎంతో ఘణమైన చరిత్ర కలిగిన ఈ పవిత్ర పుణ్య క్షేత్రం ఆదిశక్తి యైన అమ్మవారి అష్టాదశ పీఠాలలో అయిదవది అయినప్పటికిని, చేసే కనీస పూజలకు కుడా నోచుకోక ఎంతో దుర్భర దయనీయ స్థితిలోఉంది అని చెప్పుటకు సిగ్గుగా ఉన్నది. ఆ శిధిల దేవాలయాల నగరం తనలో తను కుమిలి కుమిలి గుండెలవిసేలా ఏడుస్తుంది.

కనీసపు ఆలోచన కల్గిన ప్రతి మనిషిని ఆలోచింప చేస్తుంది ఇక్కడి చిద్రమై, చిన్నాభిన్నమైన వాతావరణం. ఎన్నటికి తలరారనిధిగా, చరిత్రకే అలరారని అక్కడి దేవాలయ సముదాయం నేటికి తలమానికం, అక్కడి దేవాలయ సముదాయాన్ని చూస్తే అచ్చెరువుతో నిశ్శేష్టులవ్వక మానరు. కాని పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షం నేనే అన్నట్టు, అక్కడి శిథిల గోపురాలు ఆ "జోగులాంబకే" వదిలేసారు. నవాబుల దండయత్రకే గర్వకారణం అన్న చందంగా వాటిని శిధిలాలుగానే కనుమరుగావ్వాలని నిర్ణయించినట్టు గోచరిస్తుంది అచటి పరిస్థితి. కాని గుండెలు తరుక్కుపోయే ఎన్నో నిజాలు మనల్ని నిశ్శేష్టుల్ని చేస్తాయి, అక్కడికి చేరినప్పటినుండి మన మనో వేదన అలవి గాకుండా మారుతుంది, నేను అందుకు మినహాయింపు ఏమాత్రం కాదు సుమా... అక్కడి చరిత్ర, అమ్మవారి లీలా మహత్యం వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాగే "జోగులాంబ" కి వచ్చిన కష్టాలు చూస్తుంటే మనసు తరుక్కు పోతుంది, కళ్ళు చెమరుస్తాయి, భక్తుల హృదయాల్లో.. ప్రతీకారజ్వాల రగులుతుంది ఆ నిమిషం. మన (నా) మనసు ఎంతలా ఘోషిస్తుందో మాటలతో చెప్పటానికి ఏమాత్రం అలవిగాదు తలచుకుంటేనే భయకంపితులవుతము కాని ఏమి చేస్తాం పాలకుల దుష్ట కుల రాజకీయాలకు, ముస్లిం ప్రభువుల అహంకారానికి బలై , నేటికి శిధిలావస్థలో నిల్చొని అభివృద్దికై అర్దిస్తున్నట్టు, చేతులు చాచి వేడుకుంటున్నట్టు ... మనసు బెట్టి నన్నూ ఒక్క్కసారి చూడండి అని బిగ్గరగా రోదిస్తూ.. దిక్కులు పిక్కటిల్లేలా ఎడుస్తున్నట్టుంటుంది అక్కడి ఆలయ సముదాయ దుర్లభ స్థితి. ఆ శిధిల దేవాలయాల నగరం, తనలో తను కుమిలి కుమిలి గుండెలవిసేలా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో లో ఉన్న కారణంగానో, లేక ఈ జిల్లా వెనకబడింది అనటానికి చిహ్నం గానో, దీన్ని వెనకబడేలా తాయారు చేసారులా గోచరిస్తుంది. ఒకనాడు వెలుగులీనినా నేడు వెనకబడి వెలవెల బోతున్నాయి ఇక్కడి పరిసరాలు.


ఆ శిథిల దేవాలయాల నగరం తనలో తాను కుమిలి కుమిలి గుండెలవిసేలా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడినుండి వీడుతుంటే. ఈ శిధిలాలను ఈ పాలకులు ఎన్నాళ్ళకు పట్టించుకునేరు... అని దిగులుగా అక్కడకి వెళ్ళిన ప్రతి భక్తుణ్ణి దీనంగా అడుగుతున్నట్టుంటుంది. ఏన్నాళ్ళకి ఈ పాలకులు మేల్కొనేరు.. ఆ శిథిలాలకి పూర్వవైభవం ఎప్పటికి వచ్చేను...అని ప్రతి భక్తుడు ఆ శుభ ఘడియకై ఎదురుచూస్తున్నారు. కాని "జోగులాంబ" మాత్రం నాయకులే కాదు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తనవంతు కృషి చేస్తేనే ఆ ఆలయ సముదాయానికి కొత్త రూపు చేకూరుతుందని గాఢంగా విశ్వసిస్తుంది. జోగులాంబ ఆ రోజుకి ఊరంత కళ్ళతో తుంగభద్రా నది ఒడ్డున దీనంగా, నిశ్శేస్టురాలిలా..

పూజలర్పించే మనసులకై, మనుషులకై కోటి లింగాల సమేతముగా అర్పించే భక్తులకై, అర్చించే చేతులకై నిత్యన్నాభిషేకాలు మాని ఎదురుచూస్తుంది అలంపురవాసిని.

అర్పించి అర్చిస్తారని, అక్కడి అభివృద్ధిలో పాలు పంచుకొని ఆ "జోగులాంబ" కృపా కటాక్షానికి పాత్రులవుతారని మనస్పూర్తిగా అభిలషిస్తూ.. ధన్యవాదములతో.. "రాము"


"జోగులాంబ" కృపా కటాక్ష సిద్ధిరస్తు...